మబ్బుచాటు సూరీడు
* * * * *
రెండు దినాలసంది ఆగం జేస్తా ఉండాదబ్బా ఈ వాన అనుకుంటా ఇంటెనక్కి బొయినా నా పూల చెట్లకాడికి. కొన్ని చెట్లు పాశిపోతాయావోనని టార్పాలు గట్టినాడు మా ఇంటాయన. గాలికి గాబోలు ఒక పక్కంతా ఒరిగిపోయుండాది. దాన్ని ఇప్పి సక్కంగ గడతా ఉండా, పక్కనే రైలు కట్ట మింద ఎవురో లగెత్తినట్టు అవుపడింది. చేతిలో ఉన్న ఆ పురికోసలు ఆడ్నే పారేసి పరిగెత్తినా. ఎవురో ఆడమనిషి వానలో బడి పోతావుండాది రైలు కట్టమ్మిడి. ఆయమ్మి నడిసే తీరు జూస్తావుంటే రైలు కిందగాని పడ్నాటికి బోవడంల్యా గదా అనిపించి నేనూ ఉరికినా ఇంకన, "ఓ అమ్మాయో, ఇదిగో పాపా ఆగు ఏడికి బోతావుండావా!?" అంటా. ఆయమ్మి ఆగితేనా. రైలు బండి ఒచ్చేస్తా ఉండాది. ఓయమ్మా! ఎవురన్నా కనబడితే బావుణ్ణనుకుంటా ఇంకా గబాన పరిగెత్తినా. ఒచ్చేసిందిరా నాయనా అనుకుంటా మా పెంచలకోన నరిసిమ్మ సావిని దల్సుకొని లాగి ఈడ్సు కొచ్చేసినా ఆయమ్మి చెయ్యిబట్టి. గింజుకొనింది, నేనొదొల్లా గట్టిగా బట్టి లాక్కుపోయినా. రైలు దాటిపొయినానక జూద్దును గదా ఆయమ్మ నాకాడ పూలుగొనే ఆ పెద్ద అపార్టమెంట్లో ఉండే ఆవిఁ. "ఓయమ్మా!! ఇదేందమ్మా యాం పని తల్లా ఇదే!? నీ బిడ్డలు యావై పోతారో ఓపాలి ఆలోచించినా!?" బిడ్డల పేరెత్తే తలికి ఆడ్నే యాడస్తా కూలబడి పొయినాది. నెమ్మదిగా లేవదీసి మా ఇంటికి తోడ్కోని బొయినా. నీళ్ళిచ్చి ఒకరవ్వ నెమ్మదించినానక అడిగినా "యాందమ్మా ఆ పనా!? యాం తక్కువ తల్లాఁ నీకు, బంగారంలాంటి మొగుడూ పిలకాయల్నొదిలేసి యాడికి బోతావుండావు సెప్పో!?" మళ్ళా బొటాబొటా కళ్ళనీళ్ళు గార్సేసింది ఆయమ్మ. నాకూ ఏడుపొచ్చేసినాది, అంత సక్కంగుండే ఆయమ్మ కిదేం ఖర్మరా నాయినా అని.
"శంకరమ్మా!" అని బిలవంగనే నా పేరెట్టా దెలుసన్నట్టు జూసినా. "నువ్వన్నది నిజం శంకరమ్మా నాకేమీ తక్కువకాదు. అన్నీ ఉన్నాయి ఒక్క నాది అనే జీవితం తప్ప." అంటా ఆ యమ్మ కాడున్న సంచిలో నుంచేందో దీసింది. "ఇదిగో! ఇవన్నీ నా సర్టిఫికెట్లూ, గోల్డుమెడల్సూ చిన్నతనం నుంచీ ఎంతో పట్టుదలతో ఎంతో ఇష్టంతో కష్టపడి చదివి సాధించినవి. వీటివిలువ షోకేస్‌లో పెట్టుకోవడానికే అని పెళ్ళయ్యాకగానీ తెలియలేదు." అని జూపిస్తా ఉండాదో లేదో పొటోలు రెండు టపటపా పడ్డాయి సంచిలో నుంచి. తీసి సూస్తే తిరపతి మెడికిలు కాలేజీ కాడ దీసుకోనుంది తెల్లకోటు బుజం మిందేసుకోని. పక్కన ఇంకెవురెవురో ఉండారు. "అమ్మా నువ్వు డాట్రమ్మావా తల్లా!?" అనడిగినా. అవునన్నట్టు తలూపినాది. ఒక్క క్షణం నా పెనివిటీ ఆ యమ్మ మొగుడూ పక్కపక్కనే అవుపించినారు. రైల్మే టేసెన్లో తుడిసే పన్జేసే నా మొగుడే ఎంతో గొప్పోడిగా అనిపించినాడు. సిన్నదో పెద్దదో గవుర్మెంటు ఉజ్జోగం, ఉండడానికి ఈ కోట్రస్సూ దిగుల్లేకుండా గడిసి పోతాది మాకు. అయినా నేను గమ్ముగుండ లేక ఆ పూల చెట్లేసి, ఆ పూలన్నీ ఎత్తకపోయి కొన్ని గుళ్ళో దేవుడికిచ్చి మిగిల్నయ్యి ఆడ్నే సిన్న అంగడి బెట్టుకొని అమ్ముకొస్తా ఉంటా. ఏరోజూ 'యాం పనులు మే ఇయ్యంతా కొంపలో గూసోనుండలేవా' అన్న మాట అన్లా నా మొగుడు. నేను పన్లోకి, పిలకాయలు బళ్ళోకి బోతే ఆ యమ్మికేం ఊసుబోతాదిలే పోనీ అన్నట్టుంటాడు. 'నువ్వు నవ్వతా ఉండు మే సాలు నాకా, కూడు గూడా బల్లే ఇంకన' అంటా ఉంటాడు. యాడకి బొయినా కొత్త కొత్త పూలచెట్ల పిలకలో, అంట్లో ఎత్తకొచ్చి నాటతాడు మా పూలతోటలో. నాకొచ్చే ఆ కూసింత ఆదాయం పున్నెవా అని నేను పెతిదానికీ చెయ్యిజాప బల్లే ఆయన కాడ. నా పెనివిటికీ, పిలకాయలకీ ఖర్సుబెట్టనాటికి గూడా ఆయన తానే సెయ్యి జాపాలంటే ఒళ్ళు జచ్చిపోతాది నాకే. అంత సదువులు సదివి అన్నిటికీ మొగుడి కాడ సెయ్యి జాపాలంటే ఆ యమ్మ కెట్టుంటాది ఇంకన.
"నాకు అందరూ ఉన్నారు, కానీ నాతోనే ఎవరికీ ఏ అవసరమూ లేదు. పిల్లలకి ఆయా, వంటపనికీ, ఇంటిపనికీ అన్నిటికీ మనుషులుంటారు. నేనే పనీ చేయని గాజుబొమ్మలా ఉండిపోవాలి. 'అన్నీ ఉన్నాయి వాటిని అనుభవిచడమూ ఒక బాధేనా' అంటుందీ లోకం. చూడటానికి నాది చాలా గొప్ప జీవితం, చాలా మంది కలలు కనే జీవితం కూడా అయి ఉండవచ్చు. కానీ ఆ తళుకు బెళుకుల్లో నేను ఆనందాన్ని వెతుక్కోలేను. ఎన్ని రంగుల బట్టలున్నా ఆ తెల్లకోటు ఇచ్చే బాధ్యతతో కూడిన ఆనందమే వేరు శంకరమ్మా. 'నీకు ఏమి లోటని ఇంకా సంపాదన అని పరుగులు పెట్టాలి, హాయిగా తిని కూర్చోక' అనడిగే నా తల్లిదండ్రులు మరి నన్నెందుకు చిన్నతనం నుంచీ ఇంటికీ, వారి ప్రేమకీ దూరంగా హాస్టల్లో ఉంచి మరీ చదివించారో వాళ్ళకే తెలియదు. ప్రతి మనిషికీ తన బ్రతుక్కి ఒక అర్థం ఉండాలని ఉంటుంది. నేను నా ఇంట్లో, నా వాళ్ళ జీవితాల్లో ఉన్నా, లేకపోయినా వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పేమీ ఉండదు. ఇలా ఉన్నా గోడ మీదున్నా తేడా ఏముందని!?" అంటా సున్నీ తో మొకం గప్పుకోని ఎక్కిళ్ళు బెడతా ఆ యమ్మ అట్టా యాడస్తా ఉంటే కడుపు తరుక్కు పొయినాది నాకు. ఏం జెప్పి ఊరుకోబెట్టాలో తెలవడంల్యా నాకు. ఆ యమ్మ జెప్పిందాట్లో తప్పేం ఉండాదైనా. పనోల్లున్నే లేకపొయినా పిలకాయలకి పొద్దులస్తం యాం పనుంటాది మనతో!? ఓళ్ళ సదువులోళ్ళవి, ఆనక ఓళ్ళ ఉజ్జోగాలూ బతుకులూ ఓళ్ళకి సరిపోతుంలా. అయినా సిన్న కవరుగూడా బట్టుకోనీడు గదా ఆయన ఎంత బాగా జూసుకొంటుండాడో అనుకొంటిని నేను. ఆ యమ్మ మనసులో అంత లావు బరువు సంచులు బడేసి ఇంకేంది ఆయన జూసుకొనేదా!? ఇంట్లో అన్నీ ఉండాయి గదా అంటే సరిపోతాదా ఇంటిదాని మొకంలో నవ్వుండాదో లేదో సూడబల్లా!? పిలకాయల్ని సాకడం కోసరం ఇంకో పనీబాటా లాకుండా కొంపకే అతక్కపోవాల్నా ఏందే. యంత మంది డాకటేర్లు దొరక్క సూపించుకోనాటికి డబ్బుల్లేక సస్తా ఉంటే ఈ యమ్మ లాంటోల్లని సదీపిచ్చి మరీ ఇంట్లో కూకో బెడతారేందో ఇసిత్రం. నాకు ఎంటనే అనిపిచ్చిందొక మాట, ఆమన్నే అనేసినా అదే ముక్క "అమ్మా! ఏడిసింది సాలుగానే ఓ పాలి నేం జెప్పేదిను. నువ్వు గాదు తల్లా యాడవాలిసిందే నీ మాదిరిగా సదూకోనీ గొప్ప మనసున్నోల్లందరూ ఇంట్లో కూసుంటే డాకటర్లు ల్యాకా, టీచెర్లు ల్యాకా, ఆసపెటిల్లూ, బళ్ళూ మూసిపడేస్తా ఉంటే బీదా బిక్కీ యాడవాల. అయినా నీ అవసరం ల్యాకుండా ఎవురుండారమ్మా!? నాతో గూడా రా ఆ రైలు కట్టవతల కంపసెట్ల పక్కన తోపుండాది, ఆ తోపులో మనుషులకి ఉండనాటికి తిన్నాటికే సక్రంగా ఉండదు. టార్పాల్లూ, ఫ్లెక్సీ కాయితాలెత్తకొచ్చి ఇళ్ళులేసుకోనుంటారు. ఓల్లకి ఒక రేసను కారుడు, ఒక ఆదారు కారుడు యాం ఉండవు. ఆసపెటిల్లో సూపిచ్చుకోనాటికి ఏందిలే అయినా తిన్నాటికే ల్యాకుంటే. అసుమంటోల్లకి అవసరంల్యా అమ్మా నువ్వా!? నువ్వు సచ్చిపోడం యాందమ్మా పేణాలు నిలబెట్టాల గానే."
యాడవడం ఆపేసి అట్నే జూస్తా ఉంది. మల్లా నేనే అన్నా, "డబ్బులు కోసరం పన్జెయ్య బాక అన్నారు సరే అట్నే, నీకిట్టవైన పన్జేసి పేణాలు నిలబెట్టద్దని జెప్పరు గదా ఎవురూ సెప్పో!?" ఈసారి మాత్తరం ఆ యమ్మ మొకంలోకి యాడ్నుంచొచ్చినాదో నవ్వు, ఎంత బాగుండాదో ఆ నవ్వు. నాకు మాత్తరం కళ్ళు తడిసిపొయినాయి ఆ నవ్వు జూసి. అదేందో ఇసిత్రంగా రెండు రోజుల సంది సీకట్లు గమ్మేసిన ఆకాశం ఒక్కపాలే తెరపిచ్చింది పెళపెళమంటా బయిటికొచ్చినాడు సూరీడు.
-దివ్యమురళి
No comments:
Post a Comment