Thursday, 9 November 2017

kothi varasathwam

మొన్నో రోజూ, మా మూడేళ్ళ బుడ్డోడు నేనేదో పనిలో ఉండగా "నాన్నా!! నాన్నమ్మకీ అమ్మ ఎవరూ!?" అనడిగాడు. "మా అమ్మమ్మ రా!" అని చెప్పి పంపించాను. మరి కాసేపటికి మళ్ళీ అడిగాడు "మరైతే వాళ్ళమ్మ ఎవరూ?" అని. నాకు గుర్తున్న పేరేదో చెప్పి పంపించాను. ఇలా వాడు చీటికీ మాటికీ వచ్చి విసిగిస్తుంటే భరించలేక "ఎందుకు అడుగుతున్నావురా బాబూ! ఇపుడు ఇవన్నీ" అన్నాను కాస్త చిరాగ్గా. వాడు బిక్క మొహంతో చెప్పాడు "ఏంటంటే! ఇందాకా అక్క చెప్పింది తన స్కూల్ లో చెప్పారంట, మనుషులందరూ కోతి నుంచే పుట్టారని, ఫస్ట్ ఆ కోతికి పుట్టిందెవరో అనీ అడుగుతున్నా నాన్నా!!" 😂😂😂😂😂 

Tuesday, 7 November 2017

నోటులీల....

"ఒరేయ్ చిన్నూ!!! చిన్నూ!!! అబ్బ లేవరా," మా బామ్మ, శ్రీమతి అలారం మంగావతి గారి పిలుపుతో బద్దకంగా ఒళ్ళు విరుచుకోంటూ లేచాను. నేను నోరు విప్పి ఏదో చెప్పబోయేంతలో మళ్ళీ మొదలెట్టింది సుప్రభాతం. "త్వరగా తెమల్రా నాయన నాకు కాసిని కాఫీ చుక్కలు పడితే గాని ప్రాణం కుదుట పడదు". మరింకేం మాట్లాడకుండా కదిలాను, మనసులోనే తిట్టుకొంటూ. "అమ్మా! అమ్మా!! పాలు తేవటానికి వెళుతున్నా ఇంకేమైనా కావాలా?" అంటూ వంటగది గుమ్మంలో నిలుచున్నా. "మరింకేం వద్దు గానీ నాన్న జేబులో చిల్లర ఉంది, తలకి మంకీ క్యాపో, మఫ్లరో వేసుకో, బాగా చలిగా ఉంది." అంటూ దేవుడి గదిలోకి వెళ్తున్న అమ్మని తెలుగు సినిమా లో కామెడీ విల్లన్ లాగా చూసి, "తోక కూడా పెట్టు ఇక, మంకీ క్యాప్ అట మంకీ క్యాప్, ఇపుడు అదే వేసుకుని తిరగాలి డాంకీ లాగా." అంటూ విసురుగా కప్బోర్డ్ వేశాను నాన్న బైక్ కీస్ తీసుకుని. మొత్తానికి బైట పడ్డాను, ఏదో వాగేశాను గానీ చలి చాలా గట్టిగానే వాయించేస్తోంది. చేతులు లాగేస్తున్నాయి బండి నడపడమే చాలా కష్టంగా ఉంది. ఐన మా బామ్మ ని అనాలి ఆవిడ ఆవు పాలు తప్ప మరోటి తాగదు, అప్పటికీ ఆ పాలవాడు రాత్రి తెచ్చిస్తాను అంటూనే ఉంటాడు, ఈవిడకి పొద్దున్నే ఫ్రెష్ గా తీసిన పాలే కావాలి, నా ప్రాణం తియ్యడానికి. అసలు మా తాత ఇలాంటి చాదస్తాలు భరించలేకే వెళ్ళిపోయుంటాడు. ఇలా ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న నాకు చల్లటి గాలి ఒక్కసారిగా విసురుగా తాకే సరికి పక్కకి చూశాను. అదేదో బాడీలోషన్ యాడ్ లో లాగా ఫుల్ వులెన్ డ్రెస్ లో స్కూటీ లో నన్ను ఓవర్ టేక్ చేసి వెళ్తోంది ఆ మెరుపు తీగ. నేనూ బండిని ఉరికించాను. తనని ఒక 15 రోజుల నుంచీ గమనిస్తున్నాను రోజూ సరిగ్గా ఇదే టైం కి వస్తుంది. కాని ఎంత ట్రై చేసినా, తన మొఖం చూడ్డం మాత్రం కుదిరేలా లేదు ఈ చలి పుణ్యమా అని. తను తిన్న గ వెళ్లి పాలతని చిన్న పార్లర్ ముందు ఆగింది. ఏదో తీసుకొని మళ్లీ వెనుతిరిగింది. తనని అలా చూస్తూ ఉంటే మరీ బావుండదని అమ్మాయిలు నాకు పెద్ద విషయం కాదన్నట్టు మొహం పెట్టి, వెంటనే వెళ్తే ఏదో తనని ఫాలో చేసినట్టు ఉంటుందని అక్కడే 5 నిముషాలు వాడితో ఏదో సోది చెబుతూ నిల్చున్నా. తిరిగి వెళ్ళేప్పుడు నా కాళ్ళ దగ్గర ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే 20 రూపాయల నోటు, చేతిలోకి తీసుకోని చూస్తే, దానిపైన ఏదో మొబైల్ నెంబర్ ఉంది. నా గుండె ఒక్క జెర్క్ ఇచ్చింది. వెంటనే దాన్నిజేబులో తోసేసి, బండి స్టార్ట్ చేశా ఇందాకటి అమ్మాయి కావాలనే నాకోసం పడేసి ఉండదు కదా అనిపించింది. ఛా అంత సీన్ లేదులే అని మనసులో ఎక్కడో అనిపించినా ఆ ఆలోచనని తొక్కి పెట్టేసి నాకోసమే ఇలా నెంబర్ ఇచిందేమోనని ఉహల్లో తేలుతూ చలి సంగతి పూర్తిగా మర్చిపోయి ఇల్లు చేరాను. ఇంటికి వెళ్ళడమే, నా మొబైల్ తీసి ఆ నెంబర్ డయల్ చేశాను. నో ఆన్సర్. అలా ఓ నాలుగైదు సార్లు చేసి, సర్లే మళ్ళీ చూద్దామని, ఫ్రెష్ అయ్యి కాలేజీ కి రెడీ అయ్యి చూస్తే 5 మిస్స్డ్డ్ కాల్స్ ఆ నెంబర్ నుంచి, తిరిగి ట్రై చేస్తే మళ్ళీ నో ఆన్సర్. ఇక ఇలా కాదని, మెసేజ్ పెట్టాను, 'హాయ్' అని, టిఫిన్ చేస్తున్నపుడు, రిప్లై వచ్చింది. 'హాయ్ రా గుడ్ మార్నింగ్ ' అని అది చూడగానే నా కాళ్ళు భూమి మీద నుంచీ ఓ మూడు నాలుగు అడుగుల ఎత్తులో నడవ సాగాయి. 'యా! వెరీ గుడ్ మార్నింగ్.' అని రిప్లై ఇచ్చాను. 'బ్రేక్ ఫాస్ట్ అయిందా?' అంటూ మళ్ళీ మెసేజ్, ఎవరీ అమ్మాయి అనుకొంటూ, 'హా వాట్ అబౌట్ యు?' అని రిప్లై పెట్టాను, 'యా! అయింది, కొంచెం బిజీ, మళ్ళీ కలుద్దాం, బై'. పొద్దున్నే ఇదేమి టెన్షన్ రా బాబు కలుద్దాం అంటుంది!?కొంప తీసి తనూ మా కాలేజీ నా? ఈ ఆలోచనల్లోనే కాలేజీ కి వచ్చేశాను. మొబైల్ తీసి చూసే సరికి 3 మిస్స్డ్ కాల్స్. నేను చేస్తేనేమో నో ఆన్సర్, 15 నిముషాల తరువాత సరిగ్గా ఎలక్ట్రానిక్స్ క్లాస్ లో ఉండగా మెసేజ్, 'సారీ రా కాస్త బిజీ గా ఉండి, కాల్ లిఫ్ట్ చేయలేదు' అని. 'క్లాసు అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తా' అని రిప్లై చేశాను. 'ఓకే 12:30 తరువాత చేయి నీతో చాల మాట్లాడాలి. ఈరోజు సాయంత్రం లోపు డిసైడ్ చేసేద్దాం అనుకొంటున్నా, మరీ బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నా, నువ్వు చెప్పే దాని మీద నా డెసిషన్ ఉంటుంది. ఓకే రా బై...' దేవుడా!!! ఇదేంటి సాయంత్రం లోపు డెసిషన్ అంటుందీ!!? అసలు కాసేపు మైండ్ పని చేయడం మానేసింది నాకు. 12:00 తరువాత క్లాసుల్లేవు, నాకెందుకో ఎక్కడా ఉండబుద్ది కాలేదు. అరగంట ఉంది కదా అని బైక్ స్టార్ట్ చేశాను, ఎవరీ అమ్మాయి? 15 రోజులు గా చూస్తున్నా ఏ రోజూ మనల్ని అసలు పట్టించు కొన్నట్టు కూడా లేదు, ఒక వేళ ప్రోపోస్ చేస్తే!? ఆ ఆలోచన రాగానే మళ్ళీ జల్సా లో పాట మైండ్ లో ప్లే అయిపోతోంది. అలా గాల్లో తేలుతున్నట్టు గానే ఏదో ఆలోచనల్లో పడి ఇంటికొచ్చేసాను, తేరుకొని రివర్స్ చేసేద్దాం అనుకొనే లోపే మా ఫైర్ బ్రాండ్ చూడడం "ఏరా చిన్నూ, అపుడే వచ్చేసావే? నన్ను కొంచెం, పుష్ప అత్త వాళ్ళింటి దగ్గర దిగబెట్టురా ఈ ఎండ లో నడవలేను." అంటూ మొదలెట్టింది. "ఎండ లో నడవలేక పోతే ఇంట్లో కుర్చోవచ్చు గా క్యూరియాసిటి రోవర్ లాగా ఎందుకు అటు ఇటు తిరగటం" అని ఇంకా ఏదో అనేలోపే నాకు చాల పనుంది అంటూ మేడ మీద రూం లోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నా, లేక పోతే మా బామ్మ మళ్ళీ వెనకాలే బయల్దేరుతుంది. ఇంతలో ఎందుకో, నాతో గానీ ఆ అమ్మాయి ఎవరో ఫన్ గేమ్ ఆడట్లేదు కదా, అనవసరం గా బకరా అయిపోవడం లేదు కదా!? అనిపించింది. మొన్న ఆ మధ్య ఎపుడో ఇంటర్నెట్ కోసం ఓ సిమ్ తీసుకొన్నా, దాన్నుంచి మెసేజ్ చేశా, 'హాయ్ డియర్' అని, 5 నిముషాల తర్వాత రిప్లై 'మే ఐ నో హూ ఈజ్ దిస్?' అని.
నేను: 'నేనే స్వీటీ.., నీ బంగారం' 
రిప్లై: 'ఏహే!! స్వీటీ ఎవరు? నాకు టైం లేదు ఎవరో చెప్పు, లేదా కాల్ చెయ్'
నేను: 'కాల్ చేయలేను, కొంచెం బిజీ'
రి: 'ఓకే కుదిరినపుడే చెయ్ బై'
నే: 'చాట్ చేయొచ్చు గా, ఎవరో ఇంకా గుర్తు రాలేదా?'
రి: 'లేదు, నువ్వే చెప్పు'
నే: 'లవ్ యు డార్లింగ్, ఒక్క  ఇవ్వచ్చు గా'
రి: 'రేయ్, చెత్త వెధవా, ఎవర్రా నువ్వూ???'
వెంటనే ఆ నెంబర్ నుంచీ కాల్, నేను లిఫ్ట్ చేయలేదు. సిమ్ మార్చేశా.. హర్ట్ అయిందేమో, అనుకొంటూ, 5 నిముషాలాగి నా నెంబర్ నుంచి కాల్ చేశా, 1.. 2... 3.... రింగులైనా లిఫ్ట్ చేయలేదు, ఇంక కట్ అయిపోతుందనగా లిఫ్ట్ చేశారు "హలో" ఎవరొ మగాళ్ళు లిఫ్ట్ చేశారు, వెంటనే కట్ చేసేశా. బాబోయ్ సీన్ చాలా దూరం వెల్లినట్టుంది, ఎందుకన్నా మంచిదని నా ఫోన్ ఆఫ్ చేసేశా. అక్కడే ఉంటే టెన్షన్ ఎక్కువై పోతుందనిపించి, కిందకి వచ్చేశా. హాల్ లో అమ్మా, నాన్నా ఏదో వెతుకుతూ ఉన్నారు. నాన్న అమ్మని గట్టిగా అరుస్తున్నారు "నీకు చెప్పే పెట్టాను కదా? ఆ మాత్రం జాగ్రత్త చేయలేవా?", "లేదండీ, కప్బోర్డ్ లోనే పెట్టాను, మీ డైరీ కింద" అంటూ నన్ను చూసి "అరే చిన్నూ ఇక్కడ చిల్లర పెట్టాను నువ్వేమైనా చూశావా?" అంది. "నేనేం చూడలేదమ్మా, నాకు అన్నం పెట్టు త్వరగా వెళ్ళాలి." అన్నాను. అసలే నా టెన్షన్ లో నేనుంటే మధ్యలో ఈ చిల్లర గోలేంటి అని మనసులో తిట్టుకొంటూ. "కాస్త పెట్టుకొని తినరా, అవతల ఆ గుంటూరు సంబంధం వాళ్ళు ఫోన్ చేస్తాం అన్నారు, అన్నయ్య నెంబర్ కనిపించటం లేదు. నిన్న వాడి కొత్త నెంబర్ మీ నాన్న లంచ్ చేస్తుండే సరికి ఎవరో కొలీగ్ నోట్ చేశారట, అయినా కరెన్సీ నోట్ తప్ప వేరే పేపర్ ఏమీ దొరకలేదా?" అంది. నాకు ఒక్క సారి బుర్ర గిర్రున తిరిగి ఆగింది, ఓర్నీ!!!!!!! ఇంతకీ అది నా జేబులోంచి పడ్డ నోటా హతవిధీ...............