ఒక స్కూలు వార్షికోత్సవ వేడుకలకు అతిథిగా వెళ్ళానోసారి. ఆ స్కూలు కరెస్పాండెంటు ఒకప్పుడు నా స్టూడెంటే. అలాగని వాడేదో నా అభిమాన విద్యార్థి అనుకొంటారేమో, నా కెరీర్లో అంత వెధవని మరొకణ్ణి చూడలేదు నేను. చదువు మీద శ్రధ్ధ కాదు కదా ఏ మాత్రం గౌరవంకూడా ఉండేది కాదు వాడికి. (చదువు చెప్పే వాళ్ళ మీద కూడా లెండి). ఆ మధ్య ఎవరో అనగా విన్నాను ఏదో స్కూల్ పెట్టే సన్నాహాల్లో ఉన్నాడని. చాలా ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది. అది మొదలవడం అప్పుడే 5వ వార్షికోత్సవం దాకా రావడం కూడా అయ్యింది. ఆహ్వాన పత్రిక పట్టుకొని వచ్చినపుడు చెప్పాడు, ఒక్కో వార్షికోత్సవానికి ఒక్కో గురువుని పిలవాలని నియమం పెట్టుకొన్నాడట. అది విని నేను సంతోషించే లోపు మళ్ళీ వాడే అన్నాడు, అలా పిలిచి వాడేంటో వాళ్ళకి తెలియజెప్పాలి అనుకొంటున్నాడట. సరిగా చదవట్లేదని చిన్నతనంలో వాడిని కొంతమంది గురువులు అవమానకరంగా తిట్టడం నిజమే, కానీ ఆ తిట్లన్నీ వాడు ఇలా తీసుకొన్నాడు అనుకోలేదు, దేనికీ పనికిరాడు అన్నవాళ్ళే, మాలాంటి ఎందరో ఉపాధ్యాయులు వాడికింద పని చేసే స్థాయికి ఎదిగాడే అని ఆశ్చర్య పోవాలట. వాడి మూర్ఖత్వాన్ని చూసి జాలిపడాలో, నవ్వుకోవాలో తెలియలేదు. మొత్తానికి ఎంత కాదనుకొన్నా వాడు నా విద్యార్థి, నా బిడ్డ లాంటివాడు, సరేలెమ్మని వాడి ఆహ్వానం మన్నించి వెళ్ళాను.
కార్యక్రమం మొదలవడానికి ఇంకా కొంచెం సమయం పట్టేలా ఉందని వాడి స్కూలంతా చూపించాడు. ఒక గదిలో కూర్చోబెట్టి వెళ్ళాడు, కొంచెం పనుందని. కాసేపటికల్లా కొందరు ఉపాధ్యాయుల్ని, పిల్లల్నీ కూడా తీసుకోని వచ్చాడు. ఉపాధ్యాయులు ఎవ్వరూ పాతిక పైబడిన వాళ్ళు లేరు. ఆ పిల్లలేమో అపర మేధావుల్లా నిలుచున్నారు. వాళ్లంతా వాడి స్కూల్లో మెరికల్లాంటి విద్యార్ధులట. అదేదో పేరు కూడా చెప్పాడు వాళ్ళు ఆ బ్యాచ్ అట. వాళ్లందరిలోనూ బాగా చిన్నపిల్ల నా దృష్టిని ఆకర్షించింది. పట్టుమని ఆరేళ్ళు కూడా ఉండవు. ఈ పాప కూడా అదే బ్యాచ్ ఆ!? అని అడిగాను ఆశ్చర్యంగా. కాదనీ, ఆ అమ్మాయి జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీ విజేత అనీ చెప్పాడు. అలాగే ఒక్కో విద్యార్థి ఒక్కో రంగంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళేనని చెప్పాడు.
ఆ చిన్నపిల్ల చేతిలో ఎదో ఫైలు లాంటిది పట్టుకొని నిలుచుంది, ఒక వేళ తాను వేసిన చిత్రాలేమో అని ఆసక్తి అనిపించి, దగ్గరకి రమ్మని పిలిచాను. అవి రకరకాల పోటీల్లో ఆ పాప గెలిచినట్టుగా ఉన్న సర్టిఫికేట్లు. నాకెందుకో ఆ చిన్నారి చేతులతో గీసే బొమ్మ చూడాలని కుతూహలం కలిగింది. నా జేబులోంచి చిన్న పాకెట్ బుక్ తీసి సరదాగా ఏదైనా ఒక బొమ్మ వేయమని అడిగాను, ఏమి బొమ్మ గీయాలి అని అడిగింది. ఇల్లు బొమ్మ వేయమన్నాను నవ్వుతూ, తనకి ఆ బొమ్మ రాదని, పండ్లబుట్ట, రాకెట్, షిప్, భరతమాత, ఇలా కొన్ని రకాల బొమ్మలు మాత్రం వచ్చు అంది. ఇన్ని పోటీలు గెలిచావు కదా, బొమ్మలు వేయడం కూడా నీకు బాగా సులభమే కదా రోజూ చూసే మీ ఇంటినే నీకు వచ్చినట్టుగా వేయి అన్నాను. ఆ పిల్ల బిక్క మొహం వేసుకొని అంది, పోటీకి కొన్ని రోజుల ముందు నుంచీ ఏ బొమ్మ వేయాలో డ్రాయింగ్ టీచర్ నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తారు, ఆ బొమ్మ పదే పదే వేయడంతో తనకి చక్కగా వస్తుందనీ, క్లాస్ లో అందరికంటే ఎవరు బాగా వేస్తారో వాళ్లే ఆ పోటీ కి ఎన్నిక అవుతారనీ చెప్పింది. నాకు మతిపోయింది.
అక్కడున్న విద్యార్థుల్లో కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడిగాను, అందరి నుంచీ దాదాపు ఇలాంటి సమాధానాలే వచ్చాయి. నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆందోళనగానూ అనిపించింది. చిత్రలేఖనం నాకు తెలిసీ ఒక కళ, కానీ దాన్ని కూడా ఇలా బట్టీ పట్టే పద్దతితో నాశనం చేసేస్తున్నారే అని చాలా బాధగా అనిపించింది. వీళ్ళకి కావలిసింది విద్యను నేర్వడం కాదు, పోటీల్లో బహుమతులు గెలవడం. పోటీప్రపంచం పేరిట జనాలను వెర్రి వాళ్ళని చేసి లక్షల్లో ఫీజులు వసూలు చేసి భావితరాలను నైపుణ్య రహితంగా తయారు చేస్తున్నారు. అసలు విద్యమీద ఏమాత్రమూ గౌరవం లేని వాడు విద్యాసంస్థని నెలకొల్పడం ఏంటి!? నేను ఇలా ఆలోచనల్లో మునిగి ఉండగానే కార్యక్రమం మొదలవుతోంది రమ్మని పిలిచారు. నేనూ వెళ్ళి ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి వచ్చేసాను. నాకు ఎందుకో అక్కడ ఉండాలి అనిపించలేదు ఇక, వెంటనే బయలుదేరి పోయాను. ఎదురుగా ఫ్లెక్సీలో వాడి నిలువెత్తు ఫోటో దర్పంగా నవ్వుతూ, వాడి పాదాల దగ్గర "ప్రముఖ విద్యావేత్త నవీన్ గారు" అని రాసుంది. వెనుక నుంచీ మైక్ లో ఎవరో పిల్లలు పాడుతున్నారు
"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి|
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||"
ఆ శ్లోకం లోని విద్యా అన్న పదం నా మనసుని ములుకులా తాకింది. విద్య!!?? ఎక్కడుంది విద్య, అది ఏనాడో సమాధి చేయబడి ఇలాంటి ఎన్నో విద్యాసంస్థలకు పునాదిగా మారిపోయింది. ఇవి జీవమున్న విద్యను బోధించే ఆలయాలు కాదు, ధనం కోసం, ధనం వల్ల స్థాపించబడి, ఆ ధనార్జనే జీవితమని బోధించే స్మశానాలు.
-దివ్యమురళి