Sunday, 5 January 2020

కృషి పూర్ణిమ


(ఈ కథ స్వాతి సచిత్ర మాసపత్రిక జనవరి 2020 లో ప్రచురితమైంది.)

ఆఫీస్ పనిలో తలమునకలై ఉండగా ధన్య నుంచీ ఫోన్ కాల్, "మూవీ చాలా బావుందే! నా ఆలోచనలూ, మాటలూ చాలా వరకూ కనిపించాయి. నాకు మాత్రం పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. రైతు గురించి నేను ఏం మాట్లాడినా నవ్వి ఊరుకొంటావుగా!? నువ్వూ కుదిరినపుడు చూడు ఆ రైతులు పడే కష్టమేంటో, వాళ్ళ బాధేంటో తెలుస్తుంది" అంది. నేను నవ్వేసి అన్నాను "ఓ! అవునా బాగా ఎంజాయ్ చేశావన్నమాట అయితే!!" "నీకు నేను చెప్పింది ఫన్నీగా ఉందా!? పైగా రైతుల  గురించి ఇంత  ఎమోషనల్ గా  మాట్లాడుతూ ఉంటే నీకు ఎంజాయ్ మెంట్లా అనిపిస్తోందా!? అసలు రైతులే లేకపోతే మనకి అన్నం పెట్టే దిక్కుండరు తెలుసా!? అయినా గవర్నమెంట్ వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం, చిన్న చూపు ఎందుకో రైతులంటే…" ఆవేశంగా ఇంకా ఏదో చెప్తోండగా అన్నాన్నేను, "సరే ధన్యా!! నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం కరక్టే. నేనేం కాదనడం లేదు. నువ్వింతగా రైతుల గురించి బాధ పడుతున్నావు కదా, నీకు ఆ రైతుకి సాయపడే అవకాశం ఏదైనా వస్తే ఏంచేస్తావు?" "ఎగిరి గంతేసి, ఆనందంగా ఒప్పుకొంటా" గొంతులోని ఆ ఆవేశం ఏమాత్రం తగ్గకుండా చెప్పింది. "సరే రేపు వీకెండ్ పొద్దున్నే నా ఫ్లాట్ కొచ్చేయి నీకు ఎంతగానో నచ్చే ఒక చోటికి తీసుకెళ్తాను. బై!" అని ఫోన్ కట్ చేసి తిరిగి నా పనిలో పడిపోయాను.

                                                                                                         

అనుకొన్నట్టుగానే శనివారం పొద్దున్నే వచ్చింది ధన్య. ఇద్దరం టిఫిన్ చేసి బయల్దేరాం. దాదాపు గంటన్నర ప్రయాణం తరువాత చేరవలిసిన చోటికి చేరాం. కారు దిగుతూనే చిన్నపిల్లలా మారిపోయింది ధన్య. పచ్చని పొలాలూ, గాలికి తలలాడించే పైరూ, దూరంగా కొండలూ అన్నీ చూసి రకరకాలుగా సెల్ఫీలు దిగసాగింది. "స్వర్గం అంటే ఇదేనేమోనే అసలు! అయినా మన రైతుల శ్రమైక స్వర్గం ముందు ఆ దేవతల స్వర్గం కూడా దిగదుడుపే" ఆ సెల్ఫీలని రకరకాల క్యాప్షన్లతో పోస్ట్ చేస్తూ అంది. "అవును నిజమే!! కొందరు రైతులు తమ యవ్వనాన్నీ, అందాన్నీ ధారపోసి మరీ ఈ పసిడి పంటల స్వర్గాన్ని సృష్టిస్తూ ఉంటారు." అన్నాను. ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు. నేను తన వైపు కాకుండా ఎటోవైపు చూస్తూ నిలుచున్నా. తనూ నేను చూసే వైపే తిరిగింది. కొంచెం దూరంలో దృఢమైన శరీరంతో, ఓ యువకుడు పొలం గట్టు మీద నడుచుకొంటూ వస్తున్నాడు. ఆ వచ్చే వ్యక్తిని చూసి ధన్య ముఖంలో రంగులు మారుతున్నాయి. ఇబ్బందిగా కదిలి, ఏదో పనున్నదానిలా వేగంగా కారు దగ్గరకు వెళ్ళిపోయింది.

ఆ వస్తున్న వ్యక్తి సూర్య, కాలేజ్ లో మా సీనియర్, ధన్య ఒకప్పటి డ్రీమ్ బోయ్. తనే కాదు చాలా మంది అమ్మాయిలు సూర్యని తమ కలల రాకుమారుడిగా భావించేవాళ్ళు. అతను మాత్రం ఎప్పుడూ ఎవ్వరినీ పట్టించుకొన్నది లేదు. కానీ ధన్య పట్ల మాత్రం ఏదో ఆరాధనా భావం అతని కళ్ళల్లో వ్యక్తమయ్యేది. పెళ్ళంటూ చేసుకొంటే సూర్యనే చేసుకోవాలి అంటూండేది ధన్య ఎప్పుడూ. మా గ్రాడ్యుయేషన్ అయ్యే సరికి తను ఎమ్.బి.ఎ. చివరి సంవత్సరంలో ఉన్నాడు. నాకూ ధన్యకి వేరువేరు చోట్ల సీట్లు వచ్చి పీజీల్లో జాయిన్ అయ్యాం. సెకండ్ సెమిస్టర్ అయ్యాక కలిశాం, మేమిద్దరం బస్టాప్ లో ఉండగా అటువైపుగా వెళ్తూ కనిపించాడు సూర్య. పలకరిద్దాం అన్నాను ధన్యతో, తను ఆసక్తి చూపలేదు. అప్పుడు గమనించాను సూర్య రూపంలో వచ్చిన మార్పుని. వర్చస్సు తగ్గి కొంచెం కాంతిహీనంగా అయ్యాడు. "పీజీ అవ్వగానే ఉద్యోగం వెతుక్కోకుండా సిటీ వదిలేసి వాళ్ళూరు వెళ్ళిపోయాడట. ఆ పల్లెటూర్లో సెటిల్ అవ్వడానికి అంతంత చదువులెందుకో అర్థం కాదే బాబూ నాకు!" నిట్టూర్చింది ధన్య అతనలా వెళ్ళగానే. ఆ తరువాత కొన్నాళ్ళకి మరోచోట అనుకోకుండా కలిశాను సూర్యని, తను వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పాడు, తనకెంతో గౌరవప్రదమైన, నచ్చిన వృత్తనీ చెప్పాడు. అతని మాటలతో నాకూ ఎందుకో వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది.

 

"అరే! ఏంటిలా ఎండలో? మిమ్మల్ని నేరుగా ఇంటికే వెళ్ళమని చెప్పానుగా!?" సూర్య పలకరింపుతో గతంలోంచీ బయటకొచ్చాను. "ఏం పర్లేదు, ఈ కాస్త ఎండకే ఏమైపోతాం అయినా?" అంటూ నవ్వుతూ కారు వైపుగా నడిచాను. ధన్య ఇక తప్పపదన్నట్టు పలకరించింది అతన్ని. "అమ్మ, మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మీరు పదండి నేను బైక్ మీద వచ్చేస్తాను." అంటూ దూరంగా చెట్టు కింద ఉన్న తన బైక్ వైపుకి వెళ్ళాడతను. "ఇక్కడికి వస్తున్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" నిలదీసింది ధన్య. "అదేంటే! నీకు రైతులన్నా, వ్యవసాయం అన్నా చాలా ఇష్టం కదా!? రైతుల్నీ వారి కష్టసుఖాల్నీ దగ్గర్నుండీ చూస్తే ఇంకా సంతోషిస్తావు అనుకొన్నాను" కారు స్టార్ట్ చేస్తూ అన్నాను. "అది సరే అసలు నువ్వు సూర్యతో కాంటాక్ట్ లో ఉన్నట్టు నాతో కనీసం చెప్పలేదు!?" నిష్టూరం ధ్వనించింది తన గొంతులో. "నేను చాలా సార్లు చెప్పాలని చూశాను. తన గురించి ఎప్పుడు మాట్లాడినా మరింకేదో చెప్పి డైవర్ట్ చేసేదానివి మర్చిపోయావా!?" నేను సూటిగా అడిగే సరికి ఏమీ సమాధానం ఇవ్వకుండా కిటికీ లోంచి ఎటో చూస్తూ కూర్చుంది.

 

ఐదు నిమిషాల్లో సూర్య ఇంటికి చేరిపోయాం. సూర్య అమ్మగారు చాలా ఆదరంగా చూస్తారు వాళ్ళింటికి ఎవ్వరు వెళ్ళినా. చల్లని మజ్జిగ ఇచ్చారావిడ వెళ్ళగానే. "మీ వాళ్ళందరూ రాలేదా?" అనడిగారు. ఎవరన్నట్టు ఆశ్చర్యంగా నావైపు చూసింది ధన్య. "లేదాంటీ! వాళ్ళందరూ మొన్ననే కేరళ వెళ్ళారు ఏదో కొత్తరకం సాగుబడి గురించి తెలుసుకోటానికి. నాకు శెలవు దొరకలేదు వెళ్ళటానికి. అన్నట్టు, తను నా చిన్నప్పటి ఫ్రెండ్ ధన్య, రైతులంటే చాలా  అభిమానం" అని పరిచయం చేశాను. కొంతసేపు మాట్లాడుకొన్నాక పెరడులోకి తీసుకెళ్ళారు ఆంటీ. "ధన్యా! నీకు తెలుసా? ఆంటీ కూడా ఒక ఆదర్శ మహిళారైతు. ఇప్పుడు పొలానికి వెళ్ళనివ్వకుండా మొత్తం పనులన్నీ సూర్యనే చూస్తున్నాడని, ఇలా పెరటినే చిన్న పొలంలా మార్చేశారు ఆంటీ." అన్నాను నవ్వుతూ. "నాదేముందమ్మా మా అత్తయ్యగారైతే యుధ్ధరంగంలో ఝాన్సీరాణి లాగా ఒక్కతే ఎకరాలకెకరాలు పండించేసేవారు." అన్నారు పెద్దగా నవ్వేస్తూ. "మరి మీ మామగారు...!?" ఏదో అడగబోయి సందేహిస్తూ ఆగిపోయింది ధన్య. "ఆయన ఆర్ & బి లో చేసేవారమ్మా, ఎప్పుడూ ఉద్యోగంలో తలమునకలై ఉండేవారు. ఆయన తండ్రిగారు ఉన్నన్నాళ్ళు బానే సాగింది. తరువాత  కౌలుకివ్వడం ఇష్టంలేక మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించారావిడ. మా సూర్యకీ ఆవిడే ఆదర్శం, మంచి జీతం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన జీవితం అన్నీ కాదని వాడూ అదే బాట పట్టాడు." అంటూ తనని దేవుడి గది వద్దకి తీసుకెళ్ళి సూర్య నాన్నమ్మగారి ఫోటో చూపించారు. మంచి స్ఫురదౄపి ఆవిడ, సూర్యకి చాలా వరకూ ఆవిడ పోలికలే. రూపమే కాదు ఆవిడ సంకల్పబలం కూడా చాలా గొప్పది. ఆవిడ మనవడే కాకుండా నాలాంటి మరి కొంతమంది యువతను కూడా వ్యవసాయం వైపు అడుగులేసేలా చేసింది అదే బలం అని నా నమ్మకం. ధన్యకి ఇల్లంతా తిప్పి చూపిస్తుండగా గది మధ్యలో కొత్తగా వచ్చి చేరిన ఒక అందమైన చిత్రం నన్నాకర్షించింది. కింద పొలాలు, పైన ఆకాశం. చల్లని చిరుజల్లులతో నల్లని మట్టి సుగంధాలను తట్టిలేపే నీలిమేఘాలు ఓ వైపు. బంగారు వర్ణపు వెచ్చని కాంతితో పచ్చని పైరుని తడిమే భానుడు మరోవైపు. 'కృషి పూర్ణిమ' అని రాసుంది కింద. అద్భుతంగా అనిపించింది నాకు అలా చూస్తుండి పోయిన నన్ను గమనించి ఆంటీ అన్నారు, “సూర్యనే వేశాడమ్మా, వర్ష ఋతువు రాగానే కృషి పూర్ణిమతో మొదలైన వ్యవసాయ పనులు, ఎండావానలు రెండు సవ్యంగా ఉంటేనే విజయవంతంగా పూర్తవుతాయి అని భావం” "చాలా బావుందాంటీ" అన్నాను. మేం ముగ్గురం ఇలా ఏదో మాటల్లో ఉండగానే సూర్య వచ్చాడు, సాయి, ఫణి, జనార్ధన్ కూడా వచ్చారు తనతోపాటు. "సారీ వర్షా దార్లో వేరే పనిబడి వెళ్ళాల్సొచ్చి లేటైంది." సంజాయిషీలా అన్నాడు వస్తూనే. "ఏం పర్లేదులేరా నువ్వు ఏడాది ఆలస్యంగా వచ్చినా ఎడతెగనన్ని కబుర్లుంటాయి మా మధ్యలో." అని నవ్వుతూ మా భోజనం ఏర్పాట్లు చూస్తానని అక్కడ్నుంచీ వెళ్ళిపోయారు ఆంటీ.

 

ధన్యని వాళ్ళ ముగ్గురికీ పరిచయం చేశాక సాయి అన్నాడు "మేము ఇప్పటి వరకూ పదకొండు మందిమండీ మీరూ కలిస్తే డజను మందిమి అవుతాం. "నవ్వేసి ఊరుకొంది ధన్య, మరింకేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అన్నాడు “ఈ బృందంలో రైతులం మేం నలుగురమేనండీ. మిగిలిన వారంతా మీలాగే వ్యవసాయం మీద ఆసక్తితో మా పట్ల అభిమానంతో కలిసిన వారే. అంతా బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇలా రకరకాల విద్యల్లో ఆరితేరినవాళ్ళు. అందరం కలిసి ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆధునిక సాగుబడి విధానాల గురించి, వాతావరణంలో మార్పులని సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ఎప్పుడు ఎలాంటి పంటలు వేయాలి, ప్లాస్టిక్ నివారణ చర్యలూ, సహజ ఎరువులూ, సహజ క్రిమి సంహారకాల తయారీ ఇలా రకరకాల విషయాల మీద అవగాహన కల్పించి వాళ్ళు నష్టాలబారిన పడకుండా మా శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకోసం మా బృంద సభ్యులు కొంత మంది దేశంలో రకరకాల ప్రదేశాలు తిరిగి కొత్త విషయాలు ఎన్నో తెలుసుకొని, పరిశోధించాక వాటిని ప్రయోగపూర్వకంగా మేం నలుగురం ఆచరించి, వాటి ఫలితాలు బావుంటే రైతులకు చెబుతాం అన్నమాట. రైతుల మీద అభిమానం అంటే వాళ్ళమీద జాలిపడడమో, గవర్నమెంట్ నో, మరొకర్నో తిట్టుకోవడమో కాదు కదా కావాల్సింది, వాళ్ళ కోసం మనం వంతు చేయగలిగింది చేయడం అంతేకదా!” అని తన స్పందన కోసమన్నట్టు ఆగాడు. తనేదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది నాకు. తేలిక పరచడానికి అన్నట్టు అన్నాను నవ్వుతూ “మొత్తానికి ఇందులో వ్యవసాయం గురించి అస్సలేమాత్రం తెలియని దద్దమ్మ నేనే ధన్యా! వీళ్ళందరి దగ్గరా ఎన్నో విషయాలు తెలుసుకొన్నాను” నా మాటకి అడ్డుపడుతూ అన్నాడు సూర్య “భలేదానివే!! మొదట ఎవ్వరికైనా ఏ విషయమైనా కొత్తే అంతమాత్రాన దద్దమ్మలు అయిపోతారా?” కాస్త ఆగి ధన్య వైపు చూసి అన్నాడు “మీ ఫ్రెండ్ తన గురించి సాధ్యమైనంత తక్కువ చేసి చెప్పుకోవడానికే చూస్తుందండీ, అసలు మేము చేస్తున్న పనుల్లో చాలా వరకూ తన ఆలోచన నుండీ వచ్చినవే, ప్లాస్టిక్ రహిత గ్రామాలు, కొన్నిచోట్ల సమిష్టి వ్యవసాయం, కొన్నిచోట్లేమో సహకార వ్యవసాయం, దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులకు మార్కెటింగ్ మెళకువలు నేర్పడం, రైతులకోసం నిర్వహిచే రకరకాల వెబ్సైట్లలో సమాచారం వాళ్ళకి అందించడం, వాటిని వాళ్ళ ఫోన్ల నుండే ఉపయోగించుకొనేలా ప్రోత్సహించడం, అంతెందుకు ప్రస్తుతం తను మరో అద్భుతమైన ప్రాజెక్టు కోసం కష్టపడుతోంది తెలుసా!? త్వరలో మేమందరం కలిసి ఒక స్కూల్ ప్రారంభించ బోతున్నాం. వ్యవసాయ ప్రాధాన్యత ఏంటో ప్రయోగపూర్వకంగా చిన్నతనం నుంచే బోధిస్తాం అన్నమాట. అదీకాక ఈ చుట్టు పక్కల ఏడెనిమిది ఊళ్ళలో పిల్లలు సరైన స్కూల్ లేక రోజూ చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫీజులు కూడా నామమాత్రమే. పర్యావరణ సంరక్షణ, వ్యవసాయం గురించి సరైన అవగాహన ఉన్న భావిపౌరుల్ని తయారు చేయడం చాలా అవసరం, పైగా అది మన బాధ్యత కూడా” తనా మాట అనగానే అసలు నేను వచ్చిన పని గుర్తొచ్చి, “సూర్యా! ఇదుగో ‘కృషీ విద్యా క్షేత్రం' ప్రస్తుతానికి ఒక ఫైల్ రూపంలోనే ఉంది త్వరలో ఆచరణలోకి వచ్చి ఎందరో గొప్ప భావి ఆధునిక రైతుల్ని, పర్యావరణ సంరక్షకుల్ని మన దేశానికి ఇవ్వాలని కోరుకొంటున్నా." అంటూ ఆ ఫైల్ సూర్య చేతిలో పెట్టాను. "అసలు ఇంత త్వరగా ఒక ఫైల్ రూపంలోకి వచ్చిందంటే మీ ఫ్రెండ్ చాలా కష్టపడుతున్నారన్న మాట" అన్నాడు జనార్ధన్ ధన్యతో. ఓ నవ్వు నవ్వేసి, తన ఫోన్ తీసుకొని చూసుకొంటూ తనకేమీ పట్టనట్టు కూర్చొంది తను. నాకెందుకో కలుక్కుమంది, తను కొంచెం ఇబ్బంది పడుతుందేమో అనుకొన్నాను గానీ మరీ ఇలా ముభావంగా అయిపోతుందనుకోలేదు.

 

తను ఒకప్పుడు సూర్య అంటే ప్రాణం అన్న అమ్మాయి, పైగా రైతులంటే కూడా అభిమానం అన్నట్టు మాట్లాడుతుంది ఎపుడూ. మాలో ఒకరిగా అవడానికి ఆసక్తి చూపుతుంది అనుకొన్నాను. కానీ తనెందుకలా ప్రవర్తిస్తుందీ అర్థం కావడం లేదు. "టీచర్ల వివరాలు కూడా సేకరించావా!?" అడిగాడు సూర్య, ఫైల్ నిశితంగా చూస్తూ. "అంటే వివరాలైతే సేకరించాను గానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారు సూర్యా! అది కూడా పొద్దున్నే వచ్చి పాఠాలు చెప్పేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారట కానీ ఎవ్వరూ ఇక్కడే ఉండి స్కూల్ నిర్వహణా బాధ్యత చూసుకోటానికి ఇష్టపడటం లేదు. టీచర్లు సరిపోతారు, స్థలం, బిల్డింగ్, గవర్నమెంట్ ఫార్మాలిటీస్, ఈ సమస్యలేవీ లేవు మనకి. కానీ వీటన్నింటినీ అంకితభావంతో నిర్వహించే వ్యక్తి కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే నేనే ఆ వ్యక్తినవుదాం అనుకొంటున్నాను" అని తన సమాధానం కోసం చూశాను. "అయ్యో!! నువ్వు మాకోసం ఇప్పటికే చాలా కష్టపడుతున్నావు వర్షా. ఇది చాలు, బంగారం లాంటి నీ కెరీర్ కూడా పణంగా పెట్టి మమ్మల్ని ఇంకా ఋణగ్రస్తుల్ని చేయద్దు, చూద్దాం ఏదోక దారి దొరక్కపోదు" అంటూ తన ఫోన్ తీసి కాంటాక్ట్స్ వెతకసాగాడు. "అంటే నేను ఈ ప్రాజెక్టులో భాగం కాదా కేవలం సాయమందించే దానిని మాత్రమేనా!?" నవ్వుతూనే అడిగినా సూటిగా వచ్చిన నా ప్రశ్నకి "అరెరే! నా ఉద్దేశ్యం అదికాదు. అయినా ఈ స్కూల్ ఐడియా ఇచ్చిందే నువ్వైతే నువ్విందులో భాగం కాకపోవడమేంటి? కెరీర్ మంచి స్థాయిలో ఉండగా పాడుచేసుకోవడం ఎందుకనీ అంతే. సర్లే ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకొందాం కానీ, ఈ వారంలో నువ్వు కలవాల్సిన మనుషులూ, సేకరించాల్సిన వివరాలూ ఇంకా ఉన్నాయి" అని ఏమేం చేయాలో చెప్పాడు. ఇంకా కొంతసేపు మాట్లాడాక భోజనం చేసి బయల్దేరాం.

 

కారెక్కగానే సారీ చెప్పాను ధన్యకి. "సారీ ఎందుకులేవే బాబూ! అసలు మీరేం మాట్లాడుకొంటున్నారో, నువ్వు వీళ్ళందరితో ఇంత పరిచయం ఎప్పుడు పెంచుకొన్నావో మధ్యలో నన్నెందుకు తీసుకొచ్చావో అర్థం కాక చచ్చిపోతున్నా" అంది కణతలు నొక్కుకుంటూ. “సర్లే బాగా ఇబ్బంది పడ్డావు, కొంచెం రిలాక్స్ అవ్వు” అని తనకి నచ్చిన పాటలు పెట్టాను. కొంతసేపటికి ధన్య మళ్ళీ హుషారవడం గమనించి అన్నాను “ఈ ఏడాదిలో సూర్యకి పెళ్ళి చేసేద్దాం అనుకొంటున్నారే ఆంటీ, పాపం ఆవిడకీ వయసైపోతోంది కదా. సూర్య మాత్రం తనకదేమీ పట్టనట్టు ఉంటాడు. తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అని నా అనుమానం” తనేమంటుదోనని చూశాను. కాసేపు మౌనంగా ఉన్నాక అంది “దాందేముందిలేవే! నాన్నగారికి చెప్తాను. ఊరి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు టెంతూ, ఇంటర్లతో చదువాపేసిన అమ్మాయిలు. చూద్దాం గంతకు తగ్గ బొంత ఎవరైనా దొరక్కపోరు. అయినా అసలు పల్లెటూరి అమ్మాయిలే ఎవరూ ఇష్టపడట్లేదే, అంతా టౌన్లూ, సిటీల వైపే మొగ్గు చూపుతున్నారు పైగా అతను చేసేది ఏ ఉద్యోగమో కూడా కాదు! ఈ రోజుల్లో సగటు మధ్యతరగతి తల్లిదండ్రులందరూ తమ కూతుర్లని ఏ గవర్నమెంట్ ఉద్యోగికో, కార్పొరేట్ ఉద్యోగికో ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు” తన గొంతులోని ఆ నిర్లక్ష్యం హతాశురాల్ని చేసింది నన్ను. ”ఓహో! అన్నదాతకి ఆఖరికి కన్యాదాతలు కూడా కరువయ్యారన్నమాట!” అప్రయత్నంగా అన్నాను. “చూడు వర్షా! నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థమైంది. నేను సూర్యని ఒకప్పుడు ఇష్టపడి ఉండచ్చు, అలాగే రైతులంటే అభిమానం  చూపించిన మాటా నిజమే. మొదటిది అట్రాక్షన్, రెండోది ఇంట్రెస్ట్. ఈ రెండూ జీవితంలో తాత్కాలికమైన రెండు ఫీలింగ్స్ మాత్రమే, అంతేగానీ అవే జీవితం అని నేననుకోలేను. ఈ విషయం ఇంతటితో వదిలేయి” ఖరాఖండిగా చెప్పింది.

 

ఒక స్నేహితురాలిగా తన అభిప్రాయాన్ని గౌరవిస్తూ మౌనంగా ఉండిపోయాను. కానీ మనసులో మాత్రం ఆలోచనలు రేగుతూనే ఉన్నాయి. ధన్య మాటలు కూడా ఏ మాత్రం అవాస్తవం కాదు. ఈ విషయం కొన్నాళ్ళ క్రితం నిశ్చితార్థం అయ్యి లగ్నపత్రికల వరకూ వచ్చిన ఫణి పెళ్ళి ఆగిపోయినపుడే తెలిసింది మా అందరికీ. మా బృందం అందరిలోకీ పెద్దవాడు ఫణి, అగ్రికల్చర్ బి.ఎస్.సి చదివాడు వ్యవసాయం పట్ల మక్కువతో, చాలా నెమ్మదస్తుడు. ఇక నెల రోజుల్లో పెళ్ళనగా ఆ అమ్మాయి ఇతన్ని చేసుకోవడం ఇష్టం లేదంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో ఇక చేయగలిగేది ఏమీ లేక నిశ్చితార్థం రద్దు చేసుకొన్నారు రెండు వైపుల పెద్దలు. తరువాత తెలిసింది ఫణి పల్లెలో ఉండే ఒక సాధారణ రైతవడమే ఆమెకి నచ్చకపోవడానికి కారణమని. సూర్య పెళ్ళికి సుముఖంగా ఉండట్లేదని ఆంటీ బాధపడినపుడల్లా నాకు సూర్య కళ్ళలో ధన్య పట్ల కనిపించిన ఆరాధనే గుర్తొచ్చేది. అతని మనసులో ఒకవేళ ధన్య ఉందేమో అని ఇలా ఇద్దరినీ కలిపే చిన్న ప్రయత్నం చేశాను, అది వృధా అయినా ఒకటి మాత్రం నాకర్థమైంది, ఇద్దరి మధ్యా నేనూహించలేనంత దూరం ఉంది, అది మంచి వ్యక్తిగా బతకాలి అనుకోవడానికి, మంచి వ్యక్తిగా కనిపించాలి అనుకోవడానికి మధ్య ఉన్నంత. ఒకవేళ ఈ పెళ్ళి జరిగి ఉన్నా ధన్యకి తన కెరీర్ వదులుకోవాల్సిన అవసరంలేదు. తన ఆఫీస్ ఇక్కడకి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే. సూర్య కూడా మహిళాసాధికారత చాలా అవసరం అని భావించే వ్యక్తి, తన ఆలోచనలనీ, అభిప్రాయాలనీ తప్పక గౌరవిస్తాడనే నమ్మకం కూడా నాకు.

 

కానీ ధన్య నుంచీ ఇలాంటి సమాధానం వస్తుందనుకోలేదు, తనకి ఇష్టంలేక పోయినంత మాత్రాన సూర్యని అలా చులకన చేసి మాట్లాడటం నాకు చాలా బాధనిపించింది. రైతుల గురించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టి తెగ జాలిపడే తనే ఇప్పుడు రైతులనెవరు పెళ్ళి చేసుకొంటారు అంటోంది. నాకు ఆలోచించే కొద్దీ అసహనం పెరిగిపోతోంది. ప్రతిరోజూ నకనకలాడే కడుపులు నింపుకోడానికి ఆహారం పండిచేందుకు రైతు కావాలి, సభలూ సమావేశాల్లో, సోషల్ మీడియాలో మన ఉదారత చూపుకోవడానికీ రైతు కావాలి, కథలూ కవితలూ రాసి, సినిమాలు తీసి ప్రశంశలూ, అవార్డులూ పొందడానికీ రైతు కావాలి, రాజకీయం చేసి అధికారం దక్కించుకోడానికి కూడా రైతు కావాలి. కానీ జీవితం పంచుకోవడానికి మాత్రం రైతులు పనికిరారా!? వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడమే యువత పాలిట శాపంగా మార్చేస్తోందీ సమాజం. వ్యవసాయ రంగం పట్ల యువత విముఖత చూపితే అది భవిష్యత్తులో మన దేశ ఆహార భద్రతకే ముప్పు అన్న విషయం గ్రహించక తాత్కాలిక సుఖాల వైపు, విలాసాలవైపు పరుగు పెడుతున్నారు. రైతుల పట్ల అభిమానం అన్నది ఏసీ గదిలో కూర్చొని ఫోన్లో ఒక్క లైక్ తోనో షేర్ తోనో వ్యక్తం చేసేది కాదు. ఎవ్వరూ ఏమీ చేయట్లేదు, రైతుని ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే ముందు అసలు మనమేమన్నా చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. కనీసం మనం రోజూ తినే ఆహారం ఒక రైతన్న ఎంతో చెమటోడిస్తే వచ్చిందనే స్పృహతో వృధా చేయకుండా మెలిగినా చాలు, మనం రైతు శ్రమని గౌరవించినట్టే.

 

నేనిలా ఆలోచనల్లో ఉండగానే మెల్లిగా చినుకులు మొదలయ్యాయి. ఏ చీకూచింతా లేదన్నట్టుగా ధన్య హాయిగా నిద్రపోతోంది. ఇక పది నిముషాల్లో హైవే చేరుతామనగా వర్షం బాగా పెరిగింది. కాసేపు ఆగుదాం అనుకొంటుండగా సైడ్ మిర్రర్లోంచీ ఏదో బండి హెడ్ లైటు కనిపిస్తోంది. కాస్త దగ్గరికి వచ్చాక తెలిసింది ఆ వచ్చేది సూర్య అని. కారు స్లో చేసి ఓ పక్కకు ఆపి దిగాను. నేను మర్చిపోయి అక్కడే వదిలేసిన ఫైల్ తీసుకొచ్చాడు. “అరే! దీనికోసం ఇంత వర్షంలో తడుస్తూ రావాలా !?” అన్నాను. “ఈమాత్రం వర్షానికే నేనేమైపోనులే, అయినా ఈ వారంలో నువ్వు కలవాల్సిన వాళ్ళ వివరాలూ, చేయాల్సిన పనులూ అన్నీ ఇందులోనే ఉన్నాయిగా” నవ్వుతూ అన్నాడు. “వాటి వరకూ ఫోటోలు తీసి వాట్సప్ లో పంపించి ఉండాల్సిందిగా సూర్యా" అంటూ చూశాను తన చేతిలో చక్కగా అల్లిన సన్నజాజి మాల, నా చేతిలో పెడుతూ అన్నాడు “నువ్వు మరిచిపోయింది ఫైల్ గనుక తిరిగివ్వటానికి వచ్చాను, అదే నీ మనసైతే వచ్చేవాణ్ణికాదు” నాకు కొన్ని క్షణాలు పట్టింది తను ఏమన్నాడో అర్ధమవడానికి. పొద్దున చూసిన పెయింటింగ్ గుర్తొచ్చింది, దాని అసలైన అర్ధమేంటో ఇప్పుడు బోధపడింది. ఇప్పటి వరకూ సూర్యతో కలిసి ఎన్నో అడుగులు నడిచాను, మరో ఏడడుగులతో ఈ ప్రయాణం శాశ్వతం కావాలి. నా నిర్ణయమేంటో నాకంటే ముందు పసిగట్టినట్టుగా నా పెదాలు అప్రయత్నంగా విచ్చుకొన్నాయి.
   
  ధన్యవాదాలు                                                                                                       
  మీ దివ్యమురళి (కృష్ణసఖి)

No comments:

Post a Comment